> డివైన్ సీడ్ > ప్రేమ
ప్రేమ అమృతం కంటే మధురమైనది. ప్రేమను వర్ణించడానికి భాష లేదు. " అనిర్వచమీయం ప్రేమ " అన్నారు నారద మహర్షి.
నారద మహర్షి నారాయణుని వద్దకు వెళ్ళి "అమృతం కంటే మధురమైనది ఉన్నదా స్వామీ ?" అని అడిగాడు. అప్పుడు నారాయణుడు "ఓ పిచ్చి నారదా ప్రేమ అమృతం కంటే చాలా మధురమైనది. అమృతమునైనా అధికంగా త్రాగితే కొంత వెగుటు పుట్టవచ్చు గాని, ప్రేమను అనుభవించే కొలది ఆనందం అభివృద్ధి అవుతుంది" అన్నాడు నారాయణుడు. ప్రేమ ఇచ్చుకునేదే కాని పుచ్చుకునేది కాదు. ప్రేమే దైవం, దైవమే ప్రేమ. ప్రేమ నరుని నారాయణునిగా మారుస్తుంది.
తల్లి ప్రేమను వాత్సల్యమంటున్నారు. భార్య ప్రేమను మోహమంటున్నారు. బంధు ప్రేమను అనురాగమంటున్నారు. పదార్ధ ప్రేమను ఇచ్చ అంటున్నారు. కేవలం భగవంతుని ప్రేమను మాత్రమే ప్రేమ అన్నారు. ప్రేమ రెండక్షరముల పదము. ఈ రెండక్షరములే సర్వత్రా వ్యాపించి ఉన్నాయి. ప్రేమ లేని హృదయం ప్రేత భూమితో సమానం. మానవ తాపమును, పాపమును రెండింటినీ చల్లార్చేది ప్రేమనే.