> డివైన్ సీడ్ > సత్యం
భూమిపై అవతరించిన ప్రతి మానవునకు సత్యమే ప్రత్యక్ష దైవము. ఈ చరాచర ప్రపంచమంతయు సత్యము నుండియే ఆవిర్భవించి సత్యమునందే జీవించి సత్యమునందే లీనమగుచున్నది.
ఈ ప్రపంచమంతయూ సత్యంతోనే నిండి యున్నది. ధన,కనక, వస్తు, వాహనాదులు, భోగభాగ్యములు సత్యమునే ఆశ్రయించి ఉన్నవి. సత్యమే లేకుండిన లోకమే లేదు. సత్యము చాలా విలువైనటువంటిది. ఒకరు దాచితే దాగేది కాదు. "త్రికాల భాజ్యం సత్యం". మూడు కాలములయందునూ మారనటువంటిదే సత్యం.
సత్యం చేతనే భారతీయులు, యావత్ ప్రపంచానికి ఆధ్యాత్మిక జీవితమును ప్రకటించగలిగారు. "లోకాసమస్తా సుఖినో భవంతు" అనే ఆదర్శము ఈ సత్యము వలనే ఆవిర్భవించింది. సత్యం చిన్న పదముగా మనకు గోచరిస్తుంది. కాని సత్యమును అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఈ సత్యము నందే సర్వస్వమూ ఇమిడి వున్నది. యావత్ ప్రపంచమూ ఈ సత్యము పైననే ఆధారపడి ఉన్నది.
సత్యవిద్య తోనే శ్రీ సత్యసాయి బాబా, రామకృష్ణపరమహంస, రమణ మహర్షి, జయదేవ, గౌరాంగ,తుకారాం,తులసీదాస్, రామదాసు, కబీర్ దాసు, శారదాదేవి, మీరా, సక్కుబాయి,షిరిడీ సాయి,వెంకయ్య స్వామి, స్వామి శివానంద,స్వామి దేవానంద, ఇంకెందరో మహాత్ములు ప్రపంచ మానవాళికి శారీరక,మానసిక,సామాజిక మరియు ఆత్యాధ్మిక సేవలను అందించారు. అందుకే ఈనాడు ప్రపంచములోని అన్నీ మతములవారు, అన్నీతెగలవారు, అన్ని రాష్ట్రములవారు వారిని పూజించుచూ , గౌరవించుచున్నారు. సత్యంతో ఎన్నో గొప్ప కార్యములు అందరికీ ఆశ్చర్యం కలిగించే చర్యలు చేయవచ్చు.