> డివైన్ సీడ్ > యోగ
యోగమనగ లేని దానిని సంపాదించడము."ఆసనాల ద్వారా శారీరక దృఢత్వాన్ని, ప్రాణాయామం ద్వారా మానసిక దృఢత్వాన్ని, సాత్విక ఆహారం ద్వారా ఆరోగ్యాన్ని, ధ్యానము ద్వారా మానవునిలో దాగి వున్న అనంత శక్తిని కనుగొనుటకు" యోగాభ్యాసము ఉత్తమ మార్గము.
యోగభ్యాసములో ఏవి ముందు? ఏవి వెనుక?
యోగ సాధనలో ఆసన, ప్రాణాయామ, క్రియలు, ముద్రలు వంటి రకరకాల ప్రక్రియలు ఉంటాయి. వీటిలో ఏవి ముందు చేయాలి, ఏవి వెనుక చేయాలి అని అనేక రకాలు సందేహాలు ఎదురవుతాయి.
యోగ సాధనకు ముందుగా సాధారణ శ్వాస తీసుకోవాలి. తరువాత ఓంకారం 21 నుండి 108 సార్లు చేయాలి. తరువాత సూక్ష్మ వ్యాయామం ( శిథిలీకరణ వ్యాయామం) చేయాలి. తరువాత సూర్యనమస్కారములు చేసి, శవాసనం 2 నుండి 5 నిమిషములు వేయాలి, మీకు అలవాటైన ఆసనాలను కొంచం సేపు వేసుకొని తరువాత శవాసనం వేయాలి, తదుపరి ప్రాణాయామం 10 నుండి 20 నిమిషాలు చేయాలి, ఆఖరిగా 30 నిమిషాల ధ్యానం తో ముగించాలి.
ఈ విధముగా రోజుకు 90 నిమిషాల పాటు యోగసాధన జరుగుతుంటే శరీరం, మనస్సు మరియు ఆత్మ యొక్క సమతుల్యతను పెంపొందించుకోవచ్చు
యోగాలో ఒక భాగము ముద్రలు. ముద్రలు సూటిగా మనస్సు, నాడీ మండలం, గ్రంథుల ప్రణాళికలతో పాటు స్వయముగా పనిచేసుకోగలిగే శరీర అవయవాల మీద కూడా తమ ప్రభావాన్ని చూపిస్తాయి. ధ్యానం చేస్తునప్పుడు ప్రాణశక్తి మెదడు నుంచి పింగళ నాడి ద్వారా శరీరంలోని అనేక భాగాలకు వెళుతుంది. ఈ ప్రాణశక్తి మళ్ళీ ఇడనాడి ద్వారా మెదడుకి చేరుతుంది. ఇలా ప్రాణశక్తి శరీరంలో ముందుకి,వెనక్కి ప్రవహించే సమయములో అదనపు ప్రాణశక్తి వ్రేళ్ళకొనల ద్వారా శరీరంలో నుంచి బయట వాతావరణంలోకి వెళ్ళిపోతుంది. వ్రేళ్ళకొనలను రక రకాలైన ముద్రలలో ముడవటం వల్ల ప్రాణశక్తిని బయటకి వెళ్ళి పోనీయకుండా తిరిగి మెదడుకి వెనక్కి పంపిస్తుంది. దీనివలన ప్రాణశక్తి పెరుగుతుంది.
ముద్రలు మనస్సుని కేంద్రీకరించి ఆత్మ సాక్షాత్కారం వైపు నడుపుతాయి మరియు శారీరక రుగ్మతులనుంచి కాపాడుతాయి.