> శ్రీ గురురాయ సమాచారం > శ్రీ గురురాయ ఎవరు?
అసలు ఎవరు శ్రీ గురురాయ ? శ్రీ స్వామి దేవానంద సరస్వతి మహరాజ్ వారి పరిపూర్ణ ఆశీర్వాద శిక్షణలో వికసించిన దివ్య జ్ఞాన కమలము శ్రీ గురురాయలవారు. వీరు మనుబోలు గ్రామంలో పార్వతమ్మ సూర్య నారాయణ రాజు అనే పవిత్ర పుణ్య దంపతులకు 07.01.1984 న జన్మించారు. సోదరుడు సోమశేఖర్ రాజు, వీరికి 30 వ సంవత్సరంలో సుజితమ్మ గారితో వివాహం జరిగింది.
చదువుకొనే వయస్సు నుండి తనని తాను పోషించుకుంటు, కుటుంబ భాద్యతల కొరకు కూడా ' థియేటర్, వ్యవసాయ, వెల్డింగ్, పిల్లలకు ట్యూషన్స్, పెయింటింగ్, కంప్యూటర్, చిన్న వ్యాపార పరిశ్రమలు' ఇలా షుమారు 52 రకాల పనులను శ్రీగురురాయలవారు నిర్వర్తించారు.
గ్రామంలో ఒక్కటే కుటుంబం అయినందువల్ల ఎన్నో అవమానాలు, ఇబ్బందులను ఎదుర్కొంటూ జీవితాన్ని కొనసాగిస్తూనే పరమాత్మ సంబంధమైన వ్యాపకాలతోనూ, మహాత్ములైన గురువులతోనూ ఎక్కువగా కాలాన్ని వినియోగించేవారు.
ఓ చిన్న మొక్కకు ప్రతిరోజూ నీరు పోస్తూ వుంటే మహావృక్షం అయినట్టుగా, శ్రీ గురురాయల వారి క్రమము తప్పని ఆధ్యాత్మిక సాధన వారిని దివ్యమైన ఉన్నత శిఖరాలకు చేర్చింది. గురురాయలవారు వారి పూజ్య గురువులైన శ్రీ దేవానంద్ స్వామి వారితోనే ఋషికేష్,కాశీ,బద్రినాథ్ వంటి పుణ్య ప్రాంతాలలో ఎక్కువుగా ఉండేవారు. 2000లో శ్రీ దేవానంద్ చిన్నస్వామి వారు మహా సమాధి నొందినారు.
హోమియోపతి డాక్టర్ శ్రీ సుబ్బారావు గారితో 2013లో శ్రీమతి లతమ్మ గారు శ్రీగురురాయల వారి సన్నిధికి చేరింది, తెలుగు,తమిళ,కన్నడ ప్రాంతములకు లతమ్మ గారి ద్వారా గురురాయలవారి దివ్య లీలాతరంగాల పరిమళం నలుదిశలా వ్యాపించింది. శ్రీ గురురాయల వారి వద్దకు శాస్త్ర,రాజకీయ,ఉన్నత ఉద్యోగ, వ్యాపార ప్రముఖులు, సామాన్యులు, వ్యాధి గ్రస్థులు ఇలా అన్ని వర్గాల వారు వస్తున్న, ఏ ప్రచారము లేకుండా సాధారణ మానవునిగా, పొగడ్తలకు, విమర్శలకు లొంగకుండా, రాళ్ళలోని వజ్రముగా, భగవంతుని పొందడమే కర్తవ్యంగా గురురాయ జీవిస్తున్నారు.